Telangana BJP MLA Candidates List: ఏ క్షణంలోనైనా అభ్యర్థుల ప్రకటన : లక్ష్మణ్
X
మహిళలకు సీట్ల విషయంలో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారు కానీ.. పార్టీలో సీట్లు మాత్రం కేటాయించలేదన్నారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందని చెప్పారు. టికెట్ల కేటాయింపులో మహిళలకు, బీసీలకు పెద్ద పీట వేస్తామన్నారు. మొదటి విడతలో బీసీలకు 20సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో 50 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తైందని లక్ష్మణ్ తెలిపారు. ఏక్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. కాంగ్రెస్ ,బీఆర్ఎస్లు బీసీలను పట్టించుకోవడం లేదని.. వారిని బానిసలుగా చూస్తున్నాయని ఆరోపించారు. ఆ పార్టీల మోసపూరిత మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రధాని మోదీ సహా అగ్రనేతలందరూ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని.. ఈ సారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.