ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు మార్పు..సాయంత్రం ప్రకటన
X
ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల మార్పుకు సర్వం సిద్ధమైంది. బీజేపీ అధిష్టానం నేడు కొత్త అధ్యక్షులను ప్రకటించనుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సత్యకుమార్, తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీ , తెలంగాణ ప్రస్తుత అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్‌లకు జేపీ నడ్డా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం కొత్త అధ్యక్షుల ప్రకటన వెలువడ నుంది.
సోముకు నడ్డా ఫోన్
మంగళవారం సోమువీర్రాజుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా టర్మ్ పూర్తయినందున తప్పిస్తున్నట్లు తెలిపారు. పదవికి రాజీనామా చేయాల్సిందిగా సూచించారు. ఇక తెలంగాణలో బీజేపీ బాధ్యతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగిస్తే ఆయన మంత్రి పదవిలో కొనసాగిస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు. కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆయన స్థానంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే చర్చ కూడా జరుగుతోంది. కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే ఆయన స్థానంలో బండి సంజయ్‌కుమార్‌కు మంత్రి పదవి దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి.
రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోధీ అధ్యక్షతన కేంద్రమంత్రులు, ముఖ్యనేతలు ఇటీవల సమావేశమయ్యారు. ఇందులో భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. అదే విధంగా రాష్ట్రాల్లోని అధ్యక్షులను మార్చాలని నిర్ణయించారు.