రివర్స్ రన్పై బీజేపీ రివర్స్ గేర్.. రీజన్స్ ఏంటంటే..?
X
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటంలో బీజేపీ ఓ అడుగు వెనక్కి తగ్గింది. దశాబ్ది వేడుకల సాక్షిగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని అధికారికంగా ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ ప్రణాళికలను విరమించుకుంది. కర్నాటక ఎన్నికల ఎఫెక్ట్.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనపై నిర్వహిస్తున్న ‘మహా జనసంపర్క్ అభియాన్’లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపైనే ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు సమాచారం.
రివర్స్ రన్పై రివర్స్
రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తోంది. అధికార కార్యక్రమాలకు వ్యతిరేకంగా కేసీఆర్ సర్కార్ తీరును ‘రివర్స్ రన్’ నిరసనలతో ఎండగట్టాలని రాష్ట్ర బీజేపీ తొలుత నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
మోడీ ప్రభుత్వ విజయాలపై
రివర్స్ గేర్ విషయంలో రివర్సైన బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా మే 30 నుంచి నెల రోజుల పాటు మహా జనసంపర్క్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే మోదీ పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ హైకమాండ్.. రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్ టార్గెట్ గా ఏ కార్యక్రమం నిర్వహించినా అది కాంగ్రెస్ కు లబ్ది చేకూర్చే అవకాశముందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతికూల ప్రచారం వద్దని సూచించడంతో రివర్స్ గేర్ కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్కు దొరికిన ఛాన్స్
కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నేతలు అధికార బీఆర్ఎస్ పార్టీపైన, నాయకులపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కుటుంబ పాలన, అవినీతిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ పాత్ర ఉందని.. కవిత అరెస్ట్ అవడం ఖాయమని కూడా చెప్పుకొచ్చారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ, బీఆర్ఎస్‌లను టార్గెట్‌గా చేసుకుంది. ఇరు పార్టీలు లాలూచీ పడుతున్నాయని ఆరోపణలు చేస్తుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నిరసన కార్యక్రమాలను ప్రకటించి వెనక్కి తగ్గడం హాట్ టాపిక్ గా మారింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.