Kishan Reddy: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మళ్లీ మోసం చేసింది.. కిషన్ రెడ్డి ట్వీట్
X
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను మరోసారి మోసం చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా .. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వాటిని అమలు చేసే ఉద్దేశం లేదంటూ ట్వీట్ చేశారు. ప్రజలను మభ్యపెట్టడంలో కాంగ్రెస్‌కు ఘన చరిత్ర ఉందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు, 25, నవంబర్ 2023 నాడు.. కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా వార్తాపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ.. అందులో.. 1 ఫిబ్రవరి, 2024 నాడు రాష్ట్ర నిరుద్యోగ యువతకోసం గ్రూప్-1 పరీక్షకు నోటిఫికేషన్ ఇస్తామని గొప్పలు చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. ఈ రోజు ఫిబ్రవరి 2వ తేదీ అని గుర్తు చేశారు.
ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన మిగతా హామీలను తాము తప్పకుండా అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిందని... కానీ ఇప్పుడు హామీల దిశగా ఎలాంటి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. నమ్మి ఓటు వేసిన యువతను కాంగ్రెస్ నిండా ముంచిందని ఆరోపించారు. ఇతర హామీలను కూడా దాటవేసే ప్రయత్నం చేస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీది అక్రమాల చరిత్ర అని, అందుకే ఒక్కటి రెండు రాష్ట్రాలకు పరిమితం అయ్యిందని కిషన్ రెడ్డి ఆక్షేపించారు. కాంగ్రెస్ తీరు చూస్తే అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని దుయ్యబట్టారు. గత పదేళ్ళలో అబివృద్దికి బదులు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అవసరం లేదని.. కాంగ్రెస్ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ...సంఘటితం చేస్తామన్నారు.
ఇక రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని.. ఏ పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలకు కిషన్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. ఈరోజు ఖమ్మం కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ లిస్టులో కాంగ్రెస్ PCC సెక్రెటరీగా ఉన్న అంకిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ఉన్నారు. త్వరలో బీజేపీలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీగా చేరికలు ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు.