Home > తెలంగాణ > KTR: బీజేపీ స్టీరింగే అదానీ చేతిలో ఉంది - కేటీఆర్

KTR: బీజేపీ స్టీరింగే అదానీ చేతిలో ఉంది - కేటీఆర్

KTR: బీజేపీ స్టీరింగే అదానీ చేతిలో ఉంది - కేటీఆర్
X

ఆదిలాబాద్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈసారి ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని చెప్పారు. అమిత్ షా తనకు అలవాటైన అబద్దాలను వల వేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయని బీజేపీ చేసుకుంటున్న అడ్డగోలు ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ చేసే జుమ్లాలు, అబద్దాలను విని దేశ, తెలంగాణ ప్రజలు విసిగిపోయారని అన్నారు. జనం వాటిని నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.

అమిత్ షా దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు. ఆయనకు దమ్ముంటే అదాని గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు 100 సార్లు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ పచ్చి అబద్దం చెప్పి అమిత్ షా ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. అదిలాబాద్లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపిస్తామని ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీని మర్చిపోయారని చెప్పారు.

చట్ట ప్రకారం జిల్లాకో నవోదయ పాఠశాల, వైద్య కళాశాల, యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదని అన్నారు. గిరిజన యూనివర్సిటీకి అవసరమైన స్థలాన్ని ఇచ్చినా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు.

బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ముమ్మాటికి కేసీఆర్ చేతుల్లోనే ఉందని, ప్రధాని, బీజేపీ స్టీరింగ్ మాత్రం ఆదాని చేతిలో ఉందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీకి, అమిత్ షాకు దమ్ముంటే గత పదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో ప్రజల వివరించి వారి మద్దతు కోరాలన్నారు. ఏం చేయనందుకే కేవలం మత రాజకీయాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని వచ్చే ఎన్నికల్లోనూ 110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు.

Updated : 10 Oct 2023 4:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top