ముగిసిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్.. రేపు బీజేపీ మరో జాబితా..
X
బీజేపీ పార్టీ ఎట్టకేలకూ మరో జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఢిల్లీలో జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం 40కిపైగా స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించనుంది. పొత్తులో భాగంగా జనసేనకు 9 నుంచి 11 సీట్ల వరకు ఇవ్వాలని కమలనాధులు నిర్ణయించినట్లు సమాచారం.
బీజేపీ ఇప్పటికే రెండు విడతల్లో 53 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. అందులో ఎంపీలైన బండి సంజయ్ కు కరీంనగర్, ధర్మపురి అర్వింద్ కు కోరుట్ల, సోయం బాపురావుకు బోథ్ టికెట్ ఇచ్చింది. ఇక తాజాగా జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 9 నుంచి 11 సీట్లు జనసేనకు ఇచ్చినట్లు సమాచారం. శేరిలింగపల్లి, అంబర్ పేట, కూకట్‌పల్లి, ఖమ్మం, వైరా, అశ్వరాపుపేట, కోదాడ, నాగర్ కర్నూల్, తాండూరు స్థానాలు పవన్ కు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై గురువారం స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే జనసేన పార్టీ బీజేపీతో పొత్తుకు ముందు 32 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఆయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది.