Home > తెలంగాణ > తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు.. ఈటలకు ప్రచార కమిటీ బాధ్యతలు..!

తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు.. ఈటలకు ప్రచార కమిటీ బాధ్యతలు..!

తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు.. ఈటలకు ప్రచార కమిటీ బాధ్యతలు..!
X

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మిషన్ 90 నినాదంతో ముందుకెళ్తున్న కమలదళం వివిధ కార్యక్రమాలతో ఓటర్లకు గాలమేసేందుకు సిద్ధమైంది. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మారిపోయింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, క్యాడర్లో జోష్ తగ్గిపోవడంతో బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది. పార్టీలో సమూల మార్పులకు సిద్ధమైన కమలదళం అధ్యక్ష మార్పుతో పాటు కొందరికి కీలక పదవులు ఇవ్వాలని డిసైడైనట్లు సమాచారం.

ఈటలకు కీలక బాధ్యతలు

అసెంబ్లీ ఎన్నికలకు మరో 5నెలలు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ కీలక పదవుల భర్తీపై దృష్టి సారించింది. ఆ కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌లు ఈ అంశంపై చర్చలు జరిపారు. అత్యంత కీలకమైన పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలను సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌కు కట్టబెట్టాలని దాదాపుగా డిసైడైనట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈటల రాజేందర్‌కు చేరికల కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించినా.. కీలక పదవి ఏదీ ఇవ్వలేదు. తాజాగా ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా అధికార బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోగలమని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే బీఆర్‌ఎస్‌ నుంచి మరికొంత మంది అసంతృప్త నేతలు బీజేపీలోకి వచ్చే ఛాన్సుందని హైకమాండ్ అంచనా వేస్తోంది. నిజానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఈటల కోరుతున్నారు. కానీ వివిధ సమీకరణలు, పార్టీ నేతల అభిప్రాయాల మేరకు ప్రచార కమిటీ బాధ్యతలకు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఈటలకు ఇప్పటికే సమాచారమివ్వగా ఆయన ఓకే చెప్పినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈటలను శుక్రవారం ఢిల్లీకి పిలిపించారని ప్రచారం జరిగినా, ఆయన హస్తినకు కాకుండా గౌహతి వెళ్లినట్లుగా సమాచారం.

మోడీ కేబినెట్లోకి బండి?

పార్టీలో నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం బీజేపీకి మరో మైనస్ గా మారింది. అటు కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చింది. బీఆర్ఎస్కు కాంగ్రెస్‌ పార్టీనే గట్టి పోటీదారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కాస్తా రాష్ట్ర బీజేపీ నాయకుల్లో నిరుత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఇంఛార్జి సునీల్‌బన్సల్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలతో ఈటల ఇప్పటికే చర్చించారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడి మార్పు అంశంపైగా తీవ్రంగా చర్చ నడుస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్‌నే కొనసాగించాలని పార్టీలో కొందరు కోరుతుంటే.. ఎన్నికలను, అధికార బీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయనను మార్చడమే మంచిదని మరికొందరు నేతలు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ సంజయ్‌ను పక్కన పెడితే ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపైనా బీజేపీ హైకమాండ్ సమాలోచన చేస్తోంది.

కిషన్ రెడ్డి లేదా డీకే అరుణ..?


పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను మార్చి కిషన్‌రెడ్డి లేదా మరొకరిని నియమిస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా డీకే అరుణ పేరు సైతం తెరపైకి వచ్చినట్లు సమాచారం. అందరినీ కలుపుకొనే తత్వం, పార్టీ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆమె పేరును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అరుణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై ఇప్పటికే రాష్ట్ర ఇంఛార్జుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తైందని అన్నీ కుదిరితే ఒకట్రెండు రోజుల్లోని అధ్యక్ష మార్పుపైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.


Updated : 10 Jun 2023 10:43 AM IST
Tags:    
Next Story
Share it
Top