Home > తెలంగాణ > బీజేపీ మేనిఫెస్టో రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

బీజేపీ మేనిఫెస్టో రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

బీజేపీ మేనిఫెస్టో రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే..?
X

అసెంబ్లీ ఎన్నికలకు మరో 16 రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ జోరు పెంచింది. ఆ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల చివరి వారంలో ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు జాతీయ స్థాయి నాయకులు ప్రచారానికి రానున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 16న బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీపావళి రోజునే మేనిఫెస్టో ప్రకటిస్తారని ప్రచారం జరిగినా అది సాధ్యంకాలేదు. దీంతో 16న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాటు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని బీజేపీ చెబుతోంది. జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు, రాష్ట్రంలోని పలు నగరాల పేర్ల మార్పు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు సమాచారం.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలు నవంబర్ 23న ముగియనున్నాయి. నవంబర్ 30న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో 23 తర్వాత బీజేపీ జాతీయ స్థాయి నేతలంతా తెలంగాణలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించే ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే మూడుసార్లు తెలంగాణకు వచ్చారు. నవంబర్ 25, 26, 27 వరకు మరోసారి ప్రచారం నిర్వహించనున్నారు.

Updated : 13 Nov 2023 12:10 PM IST
Tags:    
Next Story
Share it
Top