'పవన్ కల్యాణ్ వల్లే ప్రజల్లో చీప్ అయ్యాం'.. కిషన్ రెడ్డి క్లారిటీ
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ బీజేపీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సహ... పోటీ చేసిన అగ్రనేతలంతా ఓటమి చెందారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 111 చోట్ల బీజేపీ, మిగతా 8 చోట్ల మిత్రపక్షమైన జనసేనతో కలపి పోటీ చేశాయి. పోటీ చేసిన 8 స్థానాల్లోనూ జనసేన ఓటమిపాలైంది. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ ఓడిపోవడానికి జనసేనతో పొత్తే కారణమని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపణలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు విస్తృతమయ్యాయి. జనసేనతో పొత్తు లేకుంటే హైదరాబాద్‌లో మరిన్ని సీట్లు వచ్చేవని కిషన్ రెడ్డి అభిప్రాయపడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తాజాగా.. ఈ ప్రచారంపై కిషన్ రెడ్డి స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. పవన్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తమని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యం ఉండడంతోనే జనసేనతో కలిసి బరిలో దిగామని కిషన్‌రెడ్డి అన్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు అనేది ఒకరిద్దరు తీసుకున్న నిర్ణయం కాదని... ఇరు పార్టీలు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఈ మేరకు ఓ లేఖ ద్వారా.. ఆ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని లేఖలో పేర్కొన్నారు.