బీజేపీని గెలిపించడానికే పోటీ చేశారా? ఆరెస్పీ జవాబు ఇదీ..
X
సిర్పూర్ కాగజ్ నగర్‌లో తన ఓటమిపై సమీక్ష చేసుకుని గుణపాఠాలు నేర్చుకుంటానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అధికార పార్టీ తన విజయాన్ని అడ్డుకోవడానికి ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పరాజయంతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడానని చెప్పారు. ఆయన సోమవారం కాగజ్‌నగర్‌లో విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి గెలవడానికి పోట చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు తోసిపుచ్చారు.
‘‘అది అబద్ధం. బీజేపీ పార్టీకి సిద్ధాంతపరంగానే వ్యతిరేకం. మేం ఎవరితోనూ పొత్తుపెట్టుకోలేదు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు. ఒక దొర పోయి మరో దొర వస్తున్నాడు. మా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. మా పార్టీ శ్రేణులు ఇంకా పూర్తిస్థాయిలో నిలదొక్కుకోలేదు. బీఆర్ఎస్ రిగ్గింగ్, అక్రమాలు, బెదిరింపులకు పాల్పడినా నాకు 44 వేల ఓట్లు వచ్చాయి. నేను సిర్పూర్‌లోనే ఉంటాను. హైదరాబాద్ వెళ్లినా సిర్పూర్ సమస్యలపైనే పోరాడతాను. సిర్పూర్‌లో మా హెల్ప్ లైన్ నెంబర్ ఇక ముందూ పనిచేస్తుంది’’ అని ఆరెస్పీ చెప్పారు. ఐపీఎస్ పోస్టుకు రాజీనామా చేసిన ఆరెస్పీ సిర్పూర్‌లో ముమ్మరంగా ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. బీజేపీ అభ్యర్థి పాల్పాయి హరీశ్ బాబు.. ఆరెస్పీపై 3వేల పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందారు.