Boinapally Vinod Kumar: ఇంటి పేరు ఒకటైతే బంధువులైనట్లేనా?.. మాజీ ఎంపీ బోయినపల్లి సీరియస్
X
మాజీ జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చినట్లుగా చెబుతున్న బోయినపల్లి సరితకు తనకు ఎలాంటి బంధుత్వం లేదన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. కావాలనే దీనిని బీజేపీ, కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నా సోదరుడి కూతురికి జెన్‌కో(Genco)లో అర్హత లేకున్నా సీఎండీ ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని, అసలు తనకు అన్ననే లేడని, ఆ అమ్మాయి ఎవరో ఎమిటో కూడా తెలియదు అని పేర్కొన్నారు.బోయినపల్లి ఇంటి పేరు ఉన్నంత మాత్రాన బంధుత్వం ఎలా అంటగడుతారని ప్రశ్నించారు. నేను ఎంపీగా ప్లానింగ్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఏ అధికారికారి పైన అయిన ఒత్తిడి చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక నేరగాడు నీరజ్ మోదీ నరేంద్ర మోదీ బంధువులు అవుతారా బీజేపీ సోషల్ మీడియా మిత్రులు గ్రహించాలన్నారు. రాజకీయ పోరాటం ఉండాలి కానీ తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. " నా 22 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఏనాడూ తప్పులను ప్రోత్సహించలేదు. చట్ట వ్యతిరేక పని చేయమని చెప్పను. బండి సంజయ్ కావాలనే నాపై బీజేపీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోబెల్స్ ప్రచారం ఆపాలి. ఆ అమ్మాయి నా బంధువు అని రుజువు చేయగలరా?"అని ప్రశ్నించారు.