వాగులో పడ్డ బొలేరో… అందినకాడికి దోచుకెళ్లారు
X
సమాజంలో జరిగే కొన్ని కొన్ని ఘటనలను చూస్తుంటే నవ్వాలో.. ఏడవాలో తెలియదు. అమాయకత్వమో.. లేదంటే అవకాశం దొరికింది కదా అవసరం తీర్చుకోవడమో కానీ సాయం చేసిన చేతులతోనే అందినకాడికి దోచుకెళ్లారు కొందరు జనాలు. నిర్మల్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భైంసా మండలం మాటేగాం గ్రామం వద్ద బ్రిడ్జి పై నుండి కూరగాయల లోడ్ తో వెళుతున్న బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
అలర్ట్ అయిన పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఓ భారీ క్రేన్‌ను తీసుకొచ్చి వాగులో పడ్డ బొలేరో వాహనాన్ని స్థానికుల సాయంతో బయటకు తీశారు. అంతే.. వాహనం ఒడ్డుకు చేరిందో లేదో అక్కడున్న జనమంతా కుప్పలు తెప్పులుగా ఎగబడ్డారు. వాహనం డ్రైవర్ ను పక్కకు తోసేసి మరీ ఆ వ్యాన్ లో ఉన్న కూరగాయలను అందినకాడికి లూటీ చేశారు. ఇదంతా పోలీసుల కళ్లముందే జరిగింది. కొందరైతే వాగులోకి దూకి కొట్టుకు పోతున్న కూరగాయలను కూడా ఒడిసి పట్టుకున్నారు. బ్రిడ్జిపైనున్న పోలీసులు ఇది చూసి.. ఇలా ఉండాలి జనమంటే అనుకున్నారు. కానీ ఒడ్డుకు చేరాక కానీ అసలు విషయం అర్థం కాలేదు. వాగులో కొట్టుకుపోతున్న విలువైన కూరగాయాల్ని ఒడ్డుకు చేర్చింది.. ఓనర్ కు ఇచ్చేందుకు కాదు ఇంటికి తీసుకెళ్లేందుకు అని తెలియడంతో షాక్ అవడం పోలీసుల వంతైంది.
బ్రిడ్జి పైనుండి అదుపు తప్పి వాగులో బోల్తా పడ్డ వాహనంలో ఐదు లక్షల కు పైగా విలువ చేసే కూరగాయాలు ఉన్నట్టు సమాచారం. మూడు లక్షల విలువ చేసే పచ్చి మిర్చి.. రెండు లక్షల విలువ చేసే బీరకాయ , కాకరకాయ , బెండకాయలున్నట్టు తెలిపాడు డ్రైవర్. మహారాష్ట్ర నుండి కరీంనగర్ కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు తెలిపారు పోలీసులు. డ్రైవర్ ని వాగులో నుండి సురక్షితంగా కాపాడిన జనమే విలువైన కూరగాయలను కళ్లెదుటే లూటీ చేయడంతో ఇదేం ఖర్మరా దేవుడా అనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం డ్రైవర్ వంతైంది.