BRS to CONG : కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కీలక నేతలు
X
కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత సహా మాజీ డిప్యూటీ మేయర్ హస్తం గూటికి చేరారు. ఇదే క్రమంలో వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్లో సరైన గుర్తింపు లేకపోవడంతోనే కాంగ్రెస్లో చేరుతున్నట్లు బొంతు రామ్మోహన్ అన్నారు. తెలంగాణ కోసం కష్టపడ్డవారిని గుర్తించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తామని చెప్పారు. ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సహా బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనప్పటికీ ఆయన సతీమణి హస్తం కండువా కప్పుకోవడం గమనార్హం. సునీతారెడ్డి చేవేళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే ఆమె పార్టీలో చేరినట్లు తెలుస్తోంది.