Home > తెలంగాణ > మేధావులు.. 3 అడుగులకే నీళ్లు పడ్డాయని సంతోషించారు.. కానీ

మేధావులు.. 3 అడుగులకే నీళ్లు పడ్డాయని సంతోషించారు.. కానీ

మేధావులు.. 3 అడుగులకే నీళ్లు పడ్డాయని సంతోషించారు.. కానీ
X

చాలా చోట్ల ముఖ్యంగా పల్లెటూళ్లలో బోరు వేసేందుకు.. భూగర్భ జలాలు ఎక్కడ అధికంగా ఉన్నాయో ఓ టెంకాయ(కొబ్బరి కాయ)ను చేతిలో పెట్టుకుని పరిశీలిస్తుంటారు. చేతిలో ఉన్న కొబ్బరికాయ నిలువుగా నిలిస్తే ఆ ప్లేస్ బోర్ పాయింట్ కు అనువైందని, అక్కడ తవ్వితే నీళ్లు పడతాయని నమ్ముతుంటారు. ఆ విధంగా బోర్ వేశాక నీళ్లు పడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ నగరంలోని చింతలబస్తీలో కూడా ఇదే పద్ధతిలో బోర్ వేస్తే.. మూడు అడుగులకే నీళ్లు పడ్డాయి. అంత తక్కువ లోతులోనే నీళ్లు పడడంతో అంతా సంతోషించినా.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు.





చింతలబస్తీలో నూతనంగా నిర్మాణం పూర్తిచేసుకున్న కమ్యూనిటీ బిల్డింగ్‌కి ఎంపీ నిధుల నుంచి పవర్‌ బోరు మంజూరైంది. బోరు వేసేందుకు భారీ యంత్రం తీసుకొచ్చారు. కమ్యూనిటీ హాల్ సమీపంలో బోరు తవ్వేందుకు వీల్లేకపోవడంతో రోడ్డుపైనే బోరు వేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో నీళ్లు అధికంగా ఉండే ప్రదేశాన్ని కొబ్బరి కాయ చేతిలో పెట్టుకుని పరిశీలిస్తే.. ఓ చోట బాగా ఉన్నట్లు సూచనలు కనిపించాయి. నాయకులు పూజలు చేసి బోరు తవ్వకాలు ప్రారంభించారు. మూడు అడుగులు లోతు కూడా వెళ్లకముందే నీరు ఉబికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తవ్వకం ఆపినా నీరు వస్తుండటంతో అందరూ పరిశీలిస్తే.. బోరు వేసింది సరిగా నగరవాసులకు సరఫరా చేసే నల్లా పైపుమీద అని తేలింది. ఆ తర్వాత తాగునీటి సరఫరా ఆగిపోవడంతో ఉబికే నీరూ నిలిచిపోయింది. ఈ సంఘటన వారం క్రితం చింతలబస్తీ మెయిన్ రోడ్ పై జరిగింది.

ఆ తర్వాతి రోజు జలమండలి అధికారులు ఆ ప్రదేశంలో తవ్వకాలు చేయిస్తే.. పది అంగుళాల భారీ తాగునీటి పైపులైన్‌ ఉండటాన్ని గుర్తించారు. ఆ లైన్‌ 50 ఏళ్ల కిందట వేసి ఉండవచ్చని అంచనా వేశారు. సరిగ్గా పైపు ఉన్న ప్రాంతంలో బోరు వేయడంతో పైపులైన్‌ రెండుగా చీలింది. దీంతో ‘యూ’ ఆకారంలో పైపులైన్‌ అతికించి నీటి సరఫరా పునరుద్ధరించారు. మరో వైపు కమ్యూనిటి బిల్డింగ్ కోసమని మెయిన్ రోడ్డుపై బోరు వేయడంపై విమర్శలొచ్చాయి.

Updated : 3 July 2023 9:39 AM IST
Tags:    
Next Story
Share it
Top