KishanReddy: ఎన్నికలకు సిద్ధం.. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం..
X
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు, మూడో స్థానం కోసం పోటీ పడతాయని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన ఈటల రాజేందర్తో కలిసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన తుడిచిపెట్టాలని ప్రధాని మోడీ చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సకల జనుల పాలన రావాలన్నదే తమ కోరికన్న కిషన్ రెడ్డి.. బీజేపీతోనే అది సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందన్న ఆయన.. మంగళవారం ఆదిలాబాద్లో అమిత్ షా ఆధ్వర్యంలో జరిగే సభను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మాట్లాడిన ఈటల రాజేందర్ విపక్షాలు ఎంపీ, ఎమ్మెల్యేలను అంగట్లో సరకులా అమ్ముతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికలను డబ్బుమయం చేసిందే కేసీఆర్ అని అభిప్రాయపడ్డారు. ఒక్కో నియోజకవర్గంలో రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఖర్చుపెట్టాలని సీఎం నిర్ణయించారని విమర్శించారు. బీఆర్ఎస్కు ఓటు వేయకపోతే దళిత బంధు, ఆసరా పింఛన్ రాదని ఆ పార్టీ నేతలు భయపెడుతున్నారని ఈటల ఆరోపించారు.