కాంగ్రెస్ను ఓడించేందుకు ఆ మూడు పార్టీల కుట్ర - వెంకట్ రెడ్డి
X
ప్రత్యర్థి పార్టీలపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కలిసి కాంగ్రెస్ ను ఓడించే కుట్ర చేయిస్తున్నాయని ఆరోపించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన వెంకట్ రెడ్డి.. దత్తత పేరుతో కేసీఆర్ నల్గొండ నియోజకవర్గాన్ని కేసీఆర్ మోసం చేశారని వెంకట్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వెంకట్ రెడ్డి అన్నారు, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లే దమ్ముందా అని సవాల్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల కూటమితో కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తోందని అన్నారు. ఉత్తర తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఆదరణ పెరుగుతోందని, రాహుల్ గాంధీ పర్యటనతో పార్టీ గెలుపు ఖాయమని తేలిందని వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈనెల 30న ప్రియాంక గాంధీ నల్లగొండలో పర్యటించే అవకాశముందని వెంకట్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో బీఆర్ఎస్ మైండ్ బ్లాంకైందని, ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయమని అన్నారు. టికెట్లు రాని నేతలు పార్టీపై చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వెంకటరెడ్డి ప్రకటించారు.