Home > తెలంగాణ > పెండింగ్ అభ్యర్థుల ఖరారు.. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ రెండో లిస్ట్..!

పెండింగ్ అభ్యర్థుల ఖరారు.. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ రెండో లిస్ట్..!

పెండింగ్ అభ్యర్థుల ఖరారు.. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ రెండో లిస్ట్..!
X

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ జోరు పెంచింది. మిగతా పార్టీల కన్నా ముందే 115 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు ప్రకటించిన సీఎం కేసీఆర్.. మిగిలిన 4 స్థానాల క్యాండిడేట్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తొలుత ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బీఆర్ఎస్ త్వరలోనే రెండో లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

మల్కాజ్గిరిలో కొత్త అభ్యర్థి

బీఆర్‌ఎస్‌ గత నెల 21న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే మల్కాజ్గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని కేసీఆర్ ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.

ముగ్గురు అభ్యర్థుల ఖరారు?

కేసీఆర్ పెండింగ్లో పెట్టిన జనగామ, నర్సాపూర్, గోషామహల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులపేర్లను కేసీఆర్‌ ఖరారు చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాలని వారికి సీఎం స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి నర్సాపూర్‌, నందకిషోర్‌ వ్యాస్‌ బిలాల్‌ ను గోషామహల్‌ నుంచి బరిలో నిలపాలని బీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక నాంపల్లి నియోజకవర్గ అభ్యర్థి విషయంలో ఒకట్రెండు రోజుల్లో ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నట్లు సమాచారం.

ఫస్ట్ లిస్టులో మార్పులు..!

ఇదిలా ఉంటే విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించిన నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ గతంలో ప్రకటించిన తొలి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నియోజవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చాలని టికెట్ దక్కని అసంతృప్త నేతలు హైకమాండ్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా ఉప్పల్, మంచిర్యాల, పటాన్చెరు, నాగార్జున సాగర్, కోదాడ అభ్యర్థుల మార్పుచేర్పులు జరిగే అవకాశమున్నట్లు సమాచారం.

అసమ్మతి నేతలపై దృష్టి

కాంగ్రెస్, బీజేపీల్లోని కీలక అసమ్మతి నేతలను ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ గూటికి చేర్చే వ్యూహానికి పార్టీ అధినేత కేసీఆర్‌ పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీల అభ్యర్థుల ప్రకటన అనంతరం బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో మార్పులు చేర్పులు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీల్లో టికెట్ దక్కని కీలక నేతలను బీఆర్ఎస్లో చేర్చుకొని వారికి టికెట్ ఇచ్చే ఛాన్సుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక పార్టీ నుంచి కీలక నేతలు చేజారిపోకుండా సీఎం కేసీఆర్ ఇప్పటికే బుజ్జగించినట్లు తెలుస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో పాటు ప్రవీణ్‌ (బెల్లంపల్లి), నరోత్తమ్‌ (జహీరాబాద్‌), గోలి శ్రీనివాస్‌రెడ్డి (కల్వకుర్తి), బక్కి వెంకటయ్య (దుబ్బాక) తదితరులకు ఇటీవల ప్రభుత్వ పదవులను అప్పగించారు. టికెట్ ఆశించి భంగపడ్డ ఆత్రం సక్కు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య కు కూడా కీలక పోస్టులు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.



Updated : 29 Sept 2023 5:00 PM IST
Tags:    
Next Story
Share it
Top