Home > తెలంగాణ > KCR Comments: రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ఎంతకైనా పోరాడుతాం..

KCR Comments: రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ఎంతకైనా పోరాడుతాం..

KCR Comments: రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ఎంతకైనా పోరాడుతాం..
X

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 నెలల విరామం తర్వాత ప్రజల మధ్యకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. జై తెలంగాణ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో మాట్లాడిన కేసీఆర్‌.. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబి కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు.

"కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. చివరకు డ్యామ్‌కు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతాం. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణ ను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తం. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించ వద్దనే మా పోరాటం. తెలంగాణ హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమ కారులదే. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలివి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారింది. కేఆర్ఎంబీకి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతాం. మరో ప్రజా ఉద్యమంతో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుతాం. నల్గొండ జిల్లాలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం" బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు.

తుంటి గాయం కారణంగా మూడు నెలలుగా ఫామ్ హౌస్‌లోనే రెస్ట్ తీసుకున్న కేసీఆర్.. గాయం నయం కావడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తుండటంతో మళ్లీ పొలిటికల్ యాక్టివిటీస్ షురూ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. చాలారోజుల తర్వాత కేసీఆర్ పార్టీ ఆఫీసుకి రావడంతో పెద్దఎత్తున బీఆర్ఎస్ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంగళహరతులతో గులాబీ బాస్‌కు బీఆర్ఎస్ మహిళా నేతలు ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్ అంటూ బీఆర్ఎస్ నేతల నినాదాలతో తెలంగాణ భవన్ దద్దరిల్లింది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ తొలుత భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం, జయశంకర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తర్వాత కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ నేతలతో సమీక్ష నిర్వహించారు.

Updated : 6 Feb 2024 10:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top