Lasya Nanditha:లాస్య మృతదేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
X
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్(BRS) ఎమ్మల్యే లాస్య నందిత(Lasya Nanditha)కు నివాళులర్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాసేపటి క్రితమే కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరకున్న కేసీఆర్.. ఆమె పార్థివ దేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అంతకుముందు లాస్య నందిత మరణవార్త తెలియగానే కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha), మాజీ మంత్రి హరీష్ రావు(Ex. Minister Harish Rao) లు లాస్య ఇంటికి చేరుకొని, ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిలు కూడా లాస్య ఇంటికి చేరుకున్నారు. మరోవైపు లాస్య నందిత ఇంటి వద్దకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో లాస్య ఇంటి దగ్గర పోలీసులు భద్రతను పెంచారు. లాస్య నందిత ఇంటికి చుట్టు పక్కల రోడ్లు క్లోజ్ చేశారు.
అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అదేశాలు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత లాస్య కుటుంబసభ్యులను సీఎం పరామర్శించనున్నారు. మారేడ్ పల్లి స్మశాన వాటికలో లాస్య నందిత అంత్యక్రియలు జరుగుతాయని.. ఈరోజు సాయంత్రం లోపు అంత్యక్రియలు పూర్తి అవుతాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి సాయన్న(Sayanna) అంత్య క్రియలు జరిగిన స్మశాన వాటికలోనే లాస్య నందిత అంత్యక్రియలు కూడా జరుపుతామని చెప్పారు.