కృష్ణా జలాల వివాదంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి : KCR
X
మేడిగడ్డకు కాంగ్రెస్ ఏం చేద్దామని వెళ్లిందని కేసీఆర్ ప్రశ్నించారు. నల్గొండలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రాజెక్టులోని వందలాది పిల్లర్లలో ఒకటో, రెండో చెడిపోతే రిపేర్లు చేయాలి కానీ.. రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. కడెం ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకపోలేదా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల వివాదంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలను వెంటనే ఆపేసి అఖిలపక్షంతో ఢిల్లీలో పోరాటం చేయాలని చెప్పారు.
కాంగ్రెస్ సర్కార్ నంగనాచి మాటలతో తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని అన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో నిరంతరం కరెంట్ ఇస్తారా అన్నది డౌటేనని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలనే జనరేటర్తో నడిపించారని ఎద్దేవా చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. తెలంగాణను ఆగం కాకుండా చూసుకోవడానికి బీఆర్ఎస్ ఉందని అన్నారు. డబుల్ స్పీడ్తో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కొట్లాడిందే నీళ్ల కోసమని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ మన నీళ్లను అమ్మేస్తుందని ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో చర్చకు తీసుకొస్తుంటే.. ప్రభుత్వం ఆ విషయాన్ని దాటేస్తోందన్నారు. ఇలా కాదని విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని చలో నల్గొండ సభ పెట్టినట్లు తెలిపారు. చివరి కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పోరాడుతానని.. పులిలా ఎగసి పడతానని తేల్చిచెప్పారు. ఈ ఉద్యమం ఇక్కటితో ఆగదని.. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు, కరెంట్ కష్టాలు వచ్చినా బీఆర్ఎస్ ముందుకొచ్చి నిలబడి నిలదీస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.