అబద్ధం, అహంకారానికి రేవంత్ నిలువెత్తు రూపం : Dasoju Sravan
X
తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీసేలా దావోస్లో రేవంత్ మాట్లాడారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేటీఆర్పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అబద్ధం, అహంకారానికి రేవంత్ నిలువెత్తు రూపం అని విమర్శించారు. అబద్ధపు పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఐటీ ఎగుమతులు రూ.57వేల కోట్ల నుంచి రూ.2లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. ఐటీ రంగంలో 10లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
అదానీతో ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని దాసోజు విమర్శించారు. ఢిల్లీలో అదానీపై రాహుల్ పోరాడుతుంటే.. రాష్ట్రంలో రేవంత్ ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. రేవంత్ మోదీని కలిసిన తర్వాతే అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. రక్షణ రంగంలో అదానీకి అనుభవం లేదని రాహుల్ విమర్శిస్తుంటే.. రాష్ట్రంలో అదానీ డిఫెన్స్ కంపెనీలకు రేవంత్ సర్కార్ పర్మిషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కానీ అదానీ ప్రతిపాదనలను అప్పట్లో కేసీఆర్ తిరస్కరించారని చెప్పారు.