Home > తెలంగాణ > ఎంపీగా పోటీ చేయనున్న కేటీఆర్!

ఎంపీగా పోటీ చేయనున్న కేటీఆర్!

ఎంపీగా పోటీ చేయనున్న కేటీఆర్!
X

రాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్.. ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారట. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను లోక్‌సభ బరిలో దింపాలని పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన్న మల్కాజ్‌గిరి లేదా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐతే కేటీఆర్ అంతగా సుముఖత చూపలేదని తెలుస్తోంది. అలాగని వ్యతిరేకించలేదని తెలుస్తోంది. కేసీఆర్ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానని కేటీఆర్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ఎంపీగా పోటీచేస్తే.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ప్రాధాన్యం వస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా.. లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని యోచిస్తున్నారు. ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నారట. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏడు లోక్‌సభ స్థానాల పరిధిలోనే ఆధిక్యత కనబరిచింది. అందులో మూడింట స్వల్ప ఆధిక్యమే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. స్వల్ప ఆధిక్యం లభించిన లోక్‌సభ స్థానాలపై సీరియస్‌గా దృష్టి సారిస్తోంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సమాచారం. పార్లమెంటులో కూడా క్రియాశీలంగా ఉండే నాయకుల అవసరం ఉందని భావించిన బీఆర్ఎస్.. కేటీఆర్‌ను ఎంపీ ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం.


Updated : 7 Jan 2024 12:38 PM GMT
Tags:    
Next Story
Share it
Top