మంత్రి బొత్సకు బీఆర్ఎస్ నేతల స్ట్రాంగ్ కౌంటర్
X
తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. గురువారం కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ విద్యావ్యవస్థలో కేరళను మించిపోయామన్నారు. టీఎస్పీఎస్సీలో స్కామ్ ను బయటపెట్టిందని తమ ప్రభుత్వమేనన్న ఆయన తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులైన మీరే దొడ్డి దారిన సీట్లు అమ్ముకున్నారని, ఇక మీ విద్యావ్యవస్థలో దొంగలు ఎట్ల పట్టుబడతారు? అని ప్రశ్నించారు. ఏపీకి ఒక్కటైనా అవార్డు వచ్చిందా అని ప్రశ్నించారు.
ముందు మీ ప్రజల బాగోగుల చూసుకొని, ఆ తర్వాత మా గురించి ఆలోచించండి అంటూ కౌంటర్ విసిరారు మంత్రి తలసాని. ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, పంటల్లేవన్న మంత్రి.. ఏపీ కంటే అన్ని విషయాల్లోనూ తెలంగాణ ముందున్నదని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో కూడా ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఏ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బొత్స బాధ్యతాయుతమైన వ్యక్తిగా మాట్లాడలేదన్నారు. స్కామ్ లు చేసింది వాళ్లేనని, హైదరాబాద్ కు రాకపోతే వాళ్లకు పూట గడవదంటూ ఎద్దేవా చేశారు. రాజధాని కూడా లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ సెటైర్లు వేశారు. టీఎస్పీఎస్సీలో పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
కాగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదన్నారు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది.. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి బొత్స సత్యనారాయణ.