Home > తెలంగాణ > టికెట్లు దక్కని BRS నేతలకు కాంగ్రెస్ , బీజేపీ గాలం

టికెట్లు దక్కని BRS నేతలకు కాంగ్రెస్ , బీజేపీ గాలం

టికెట్లు దక్కని BRS నేతలకు కాంగ్రెస్ , బీజేపీ గాలం
X

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఏకంగా 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ నాయకత్వం ఒకేసారి ప్రకటించడం ప్రస్తుతం రాష్ట్రంలో కాక రేపుతోంది. మూడు ప్రధాన రాజకీయపార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. టికెట్‌ దక్కని ఆశావహులు అసమ్మతి రాగం ఎత్తుకోగా.. వారిని బుజ్జగించే పనిని కూడా వేగవంతం చేసింది బీఆర్‌ఎస్‌ . అసంతృప్తి నేతలు తమ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరో వైపు టిక్కెట్ దక్కని బీఆర్‌ఎస్‌ కీలక నేతలకు గాలం వేసి, తమ తరఫున బరిలోకి దింపేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఇతర పార్టీల ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాయి. ప్రజల్లో ప్రభావం చూపగలిగే లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా సంప్రదింపులు జరుపుతున్నాయి.





బీఆర్ఎస్ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్న కాంగ్రెస్.. డిసెంబర్ తర్వాత హస్తానిదే అధికారమని వారికి ఆశ చూపుతున్నది. అయితే చాలా మంది నేతలు పార్టీ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. టికెట్లపై గ్యారంటీ ఇవ్వకపోవడంతో డైలమాలో ఉన్నట్లు తెలిసింది. టికెట్లపై స్పష్టమైన హామీ లభిస్తే, చాలా మంది నేతలు కండువా కప్పుకునేందుకు క్యూ కడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు కీలక నేతలైన వేముల వీరేశం, ముద్దగోని రామ్మోహన్ గౌడ్, నీలం మధు ముదిరాజ్, మలిపెద్ది సుధీర్ రెడ్డి, జలగం వెంకట్రావ్, ఎడ్ల సుధాకర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, రాములు నాయక్ తోపాటు ఇటీవల మంత్రి హరీశ్ రావు పై తీవ్ర విమర్శలు చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావులపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. వారిని పార్టీలో తీసుకువచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు నేతలతో చర్చలు కూడా జరిపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

ఇక బీజేపీ కూడా బీఆర్ఎస్ అసంతృప్తులను ఆకట్టుకునేందుకు భారీగానే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం టికెట్ దక్కని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ను తమ పార్టీలోకి చేర్చుకోవాలని.. సంప్రదింపులు సైతం జరిపినట్లు తెలిసింది. అయితే చెన్నమనేని రమేశ్ పై పౌరసత్వానికి సంబంధించి కేసు నడుస్తుండడంతో.. టికెట్టు తనకు ఇవ్వకపోయినా, తన కుమారుడికి టికెట్ కేటాయించాలని చెన్నమనేని బీజేపీ నేతల ముందు ప్రపోజల్ పెట్టారట. ఇదిలా ఉండగా.. బీజేపీ నేతలు మైనంపల్లితో కూడా టచ్ లో వెళ్లినట్లు సమాచారం. మరోవైపు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మైనంపల్లి కలుసుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి.




Updated : 24 Aug 2023 3:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top