మజ్లిస్ మిత్ర పక్షమే.. మాది బరాబర్ సెక్యులర్ పార్టీయే.. - సీఎం కేసీఆర్
X
బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు మంచి దోస్తులని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో రాష్ట్రాభివృద్ధిపై జరిగిన దీర్ఘకాలిక చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమది సెక్యులర్ పార్టీ అన్న కేసీఆర్.. ఈ అంశాన్ని ప్రజల ముందుంచి ఇప్పటి వరకు ఓట్లు అడిగామని ఇకపైనా బీఆర్ఎస్ అదే విధానం అనుసరిస్తుందని చెప్పారు. భవిష్యత్‌లోనూ మజ్లిస్‌ను కలుపుకొని పోతామని సీఎం స్పష్టం చేశారు.
బ్రాహ్మణులకైనా, మైనార్టీలకైనా బహిరంగంగానే మంచి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలవికాని హామీలను తాము ఎప్పుడూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఓట్ల కోసం మత కుంపట్లు రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలనుకునే రకం తాము కాదని తేల్చిచెప్పారు. అన్నీ ఉచితంగా ఇస్తున్నామని తెలంగాణను విమర్శించిన బీజేపీ.. కర్ణాటక ఎన్నికల్లో ఎన్నో ఉచితాల హామీలు ప్రకటించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తమ అమ్ముల పొదిలో కూడా చాలా అస్త్రాలు ఉన్నాయన్న ఆయన వాటిని తీసినప్పుడు విపక్షాలు గాలిలో కొట్టుకుపోతాయని అన్నారు.