Harish Rao: పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిందే మేము.. హరీష్ రావు
X
ప్రతిపక్షంపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేయడం సరికాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. కాస్త వ్యంగ్యం తగ్గించుకొని.. వ్యవహారం మీద దృష్టి సారించాలని సూచించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున జీతాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అబద్ధమని పేర్కొన్నారు. పలు శాఖల్లో ఏడో తారీఖు వరకు కూడా జీతాలు పడ్డాయి. ఇప్పటికీ కొన్ని శాఖల్లో జీతాలే పడలేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు
"జనవరి నెలలో ఆసరా పెన్షన్లు ఇవ్వలేదు. ఫిబ్రవరి ఒకటి, రెండో తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది జనవరి నెలదా..? ఫిబ్రవరి నెలదా..? స్పష్టత ఇవ్వాలి. ఒకటో తారీఖు రోజునే పెన్షన్లు ఇచ్చామని గొప్పలు చెప్పి పప్పులో కాలేశారు. ఇది కరెక్షన్ చేసుకోవాలి అని హరీశ్‌రావు సూచించారు. రైతుబంధు విషయంలో అసత్యాలు మాట్లాడారు. తాము రూ.7500 కోట్ల రైతుబంధు ఇవ్వాల్సి ఉంటే.. దాదాపు రూ. 6 వేల కోట్ల మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం. మిగిలి దాని విషయంలో ఆలస్యం జరిగి ఉండొచ్చు. మీ హయాంలో ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉంది" అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
"ఈ రోజు గొప్పదినం. పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వడం మనందరికీ గర్వకారణం. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే.. ఈ రోజు కేంద్రం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏగక్రీవ తీర్మానం చేసి కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాలి. మన పీవీ గౌరవాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పీవీని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ ఘాట్‌ను ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేశాం. పీవీ కుమార్తె సురభి వాణిదేవీకి ఎమ్మెల్సీ ఇచ్చాం. పీవీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాం. భారతరత్న ఇవ్వాలని నినందించం.. అది నిజం కావడం మనందరికీ గర్వకారణం. ఈ నేపథ్యంలో కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరుతున్నాను" అని అన్నారు.