కోమటిరెడ్డిపై హరీశ్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. "నువ్వు ఎంత అరిచినా మంత్రి పదవి రాదులే అన్నా" అని రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ పై వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ సభ్యుల్లో నవ్వులు పూశాయి. ఇక అనంతరం మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబ పాలనో ఎవరిదో దేశం మొత్తం తెలుసునని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష సభ్యుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజా సమస్యలను మాట్లాడనీయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. మొదటి సభలోనే ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.