Harish Rao : కేసీఆర్‌ను ప్రజలు తరిమికొట్టారన్న సీఎం వ్యాఖ్యలపై హరీష్ రావు రియాక్షన్ ఇదే
X
కేసీఆర్‌ను 2009లో కరీంనగర్ ప్రజలు తరిమితే.. పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. సోమవారం అసెంబ్లీలో సాగు నీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలు ఆయన్ను ఆదరించి గెలిపిస్తే.. అలాంటి మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో ఉన్నాడన్నారు. సాగు నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతుంటే రాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు రాకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభకు వచ్చి చర్చలో పాల్గొని వాస్తవాలను వివరించి ప్రభుత్వ తీర్మానంపై విధాన నిర్ణయాన్ని ప్రకటించి ఉండాల్సిందన్నారు. సభలో ఎమ్మెల్యే హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో కేసీఆర్‌ను తరిమికొట్టారన్న వ్యాఖ్యలపై హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కొడంగల్‌లో రేవంత్‌ను తరిమితే ఆయన మల్కాజిగిరికి వచ్చారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కంటే ఘాటుగా, దీటుగా తాను సమాధానం చెబుతానని అన్నారు. కేసీఆర్ జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడన్నారు. గతంలో నల్లగొండలో కాంగ్రెస్ సీట్లు సున్నా అని.. బండ్లు ఓడలైతాయి.. ఓడలు బండ్లు అవుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపకానికి సంబంధించి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ని ఆయన ఖండించారు.
రెండో అపెక్స్ కమిటీ మీటింగ్‌లో కృష్ణా నీటి ప్రాజెక్టులను KRMBకి అప్పగించేందుకు గత ప్రభుత్వం ఒప్పుకుందన్న విషయాన్ని హరీష్ రావు ఖండించారు. ఇది అసత్య ఆరోపణగా ఆయన తెలిపారు. ఇందుకు ప్రస్తుత ప్రభుత్వంలోని నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖ నిదర్శనం అంటూ లేఖను ఆయన చూపించారు. పేజీ నెంబర్ 3లోని పేరాగ్రాఫ్ సీలో ఈ వివరాలు ఉన్నాయన్నారు. 17వ KRMB మీటింగ్ లో కూడా గత ప్రభుత్వం ప్రాజెక్టులను KRMBకి అప్పగించేందుకు ఒప్పుకోలేదన్న విషయాన్ని రాహుల్ బొజ్జా రాశారని ఆయన వివరించారు.