Home > తెలంగాణ > కరెంటు కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం - కేటీఆర్

కరెంటు కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం - కేటీఆర్

కరెంటు కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం - కేటీఆర్
X

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు ఆ పార్టీయే కారణమని అన్నారు. నీళ్లు, బొగ్గు లేని రాయ‌ల‌సీమలో, బొగ్గు లేని విజ‌య‌వాడ‌లో థ‌ర్మ‌ల్ పవ‌ర్ కేంద్రాలు నెల‌కొల్పిన కాంగ్రెస్.. తెలంగాణ‌లో విద్యుత్ కేంద్రాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్ప‌డే నాటికి 2700 మెగావాట్ల‌ లోటులో ఉన్నదని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తన చ‌రిత్ర‌ను, నిర్వాకాన్ని వైట్ పేప‌ర్‌లో చాలా గొప్ప‌గా చెప్పిందని కేటీఆర్ సటైర్ వేశారు. ప్రజలు 11సార్లు అవ‌కాశమిచ్చినా 2014 నాటికి 6 గంట‌ల క‌రెంట్ మాత్ర‌మే ఇచ్చిన అస‌మ‌ర్థ‌త‌, చేత‌కానిత‌నం వారదని వారే ఒప్పుకున్నారని విమర్శించారు. మాన‌కొండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని నేదునూరు, చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గంలోని శంక‌ర్‌ప‌ల్లిలో ఆనాడు యూపీఏ ప్ర‌భుత్వం గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెల‌కొల్పుతామ‌ని భూసేక‌ర‌ణ చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. నాడు తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం గ‌ట్టిగా కొట్లాడామని చెప్పారు.

దేశంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం స‌ఫ‌ల‌మైందా అని కేటీఆర్ ప్రశ్నించారు. యూపీఏ హయాంలో జైపాల్ రెడ్డి పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండి కూడా గ్యాస్ కేటాయించలేదని మండిపడ్డారు. అందుకే ఆ రెండు ప్రాజెక్టులు ప్రారంభంకాలేదని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దాన్ని చేపట్టాలని కేటీఆర్ సూచించారు. నేదనూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ సభలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.


Updated : 21 Dec 2023 1:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top