నా కూతురును అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు.. MLA ముత్తిరెడ్డి
X
తన తండ్రి తప్పు చేశారంటూ, అందుకు క్షమాపణలు కోరుతూ ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మత్తడి భూమిని తన తండ్రి అక్రమంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేశాడని, తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని ఆమె ప్రకటించారు. సదరు భూమి చుట్టూ ఉన్న ప్రహారీని కూల్చి వేసి చేర్యాల ప్రజలు తనను ఈ విషయంలో క్షమించాలని కూడా విజ్ఞప్తి చేశారు. తాజాగా.. కూతురి ఆరోపణలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందించారు.
ఈ మేరకు ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. పట్టా భూమినే కొనుగోలు చేశా. నన్ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేని సన్నాసులు.. నా కూతురును అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ప్రత్యేక కమిటీతో సీఎస్ విచారణ జరిపించాలి. ప్రభుత్వ భూమి అని తేలితే ఏ శిక్షకైనా సిద్ధం. నేను ఎక్కడా భూములు కబ్జా చేయలేదు. కుట్రలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు’’ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వెల్లడించారు.