Padi Kaushik Reddy: సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X
హరీశ్‌రావుకు (BRS MLA Harishrao) అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాల్సిందే అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్లు మాట్లాడారని, సీఎం తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ (BRS Chief KCR) చేసిన పనులను సీఎం రేవంత్.. తాను చేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం అందజేసిన నియామక పత్రాలు కేసీఆర్ ఇచ్చినవే అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రకటించిన నోటిఫికేషన్ కాకుండా అదనంగా రెండు లక్షల ఉద్యోగాలు నింపాలని డిమాండ్ చేశారు.
‘‘ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు మంచి పాలన అందించాలని బీఆర్ఎస్ కోరుకుంటోంది. మీ పార్టీలో మీరు అంటే పొసగటం లేదు.. మీ పార్టీలోనే ఔరంగజేబులు ఉన్నారు. కాంగ్రెస్‌లో ఏక్ నాథ్ షిండే అయ్యేదే రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసు ట్రయల్స్ పూర్తి అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిన వెంటనే.. మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా ఉండాలి’’ అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.