కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి భావోద్వేగం
X
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. సెప్టెంబర్‌లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అధికార పార్టీ బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. సీఎం కేసీఆర్ అభ్యర్థులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. మెదటి జాబితాను కూడా సిద్ధం చేశారు. దానిని ఏ సమయంలోనైనా ప్రకటించే అవకాశం ఉంది. సిట్టింగ్ స్థానాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.
స్టేషన్ ఘనపూర్ లో ముఖ్య కార్యకర్తలతో కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భావోద్వేగాలకు గురయ్యారు. కార్యకర్తలందరినీ చూస్తుంటే సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతోందని అన్నారు. చెడు ప్రవర్తనతో తాను ఏనాడూ కార్యకర్తలకు, ప్రజలకు తలవొంపులు తెచ్చే పరిస్థితి కల్పించలేదని, తాను చెడ్డవాడ్ని కాదని స్పష్టం చేశారు. "రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. మార్పులు జరిగే నియోజకవర్గాలలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కూడా ఒకటి. మార్పు జరిగి నాకు అవకాశం వస్తే నిండు మనసుతో ఆశీర్వదించాలి" అని కడియ శ్రీహరి కోరారు.
ప్రస్తుతం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే ఎవరు అంటే సిగ్గేస్తుందని..అదే తనకు అవకాశమిచ్చి గెలిపిస్తే మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని చెప్పే విధంగా పనితీరు ఉంటుందని హామీ ఇచ్చారు . నియోజకవర్గానికి చెడ్డ పేరు తీసుకురాన్నారు. కడియం శ్రీహరి వస్తే అవినీతిపరులకు అడల్ అని.. నేను వస్తున్నాను అంటేనే గోకేవారు , గీకేవారు , భూ కబ్జాదారులు పారిపోవాల్సిందే అని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెట్టిన రాజకీయ భిక్ష వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ఈ విషయం చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని కడియం శ్రీహరి తెలిపారు.