ధర్మపురి అర్వింద్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్
X
24 గంటల్లో తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సవాల్ విసిరారు. ఆ ఆరోపణలను నిజమని నిరూపించకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ‘‘ఎంపీగా ఉన్నప్పుడు 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చాను. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే స్పైస్ బోర్డు తెచ్చినా.. అర్వింద్ తెచ్చానని చెబుతున్నారు. ఇప్పుడు నా భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పేరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నేను, నాన్న, అన్న, రాజకీయాల్లో ఉన్నాం అని సహించాం. నా భర్త పేరు వాడటం సరైన పద్ధతి కాదు’’ అని కవిత అన్నారు.
శుక్రవారం నిజామాబాద్‌లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు గొప్ప విషయమని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంతో ఈ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఐటీ హబ్ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. ఉద్యోగాలు సృష్టించేందుకు కూడా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. యువత తమ నైపుణ్యాలతో ఐటీ హబ్ స్పేస్‌ను వాడుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. నిజామాబాద్‌లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి ఐటీ హబ్ కేంద్ర బిందువు అవుతుందని తెలిపారు. ఇది మొదటి దశ మాత్రమే అని, త్వరలో రెండో దశగా ఐటీ హబ్ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్క్, ఆటో పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాకు విదేశీ కంపెనీలు రావడానికి సహకరించిన మహేశ్ బిగాలకు ధన్యవాదాలు తెలిపారు.