Manne Srinivas Reddy : మహబూబ్ నగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ ఆయనే
X
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ వేగం పెంచింది. నిన్న నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తాజాగా మరో అభ్యర్థిని గులాబి బాస్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇప్పటికే పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ బోయినపల్లి వినోధ్ కుమార్, మహబూబాబాద్ మాలోతు కవిత, ఖమ్మం నామా నాగేశ్వరరావు పేర్లను కేసీఆర్ ప్రకటించారు. తాజాగా మహబూబ్ నగర్‌కు మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి డీకే అరుణని 77వేల పై చిలుకు ఓట్లతో ఓడించారు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి ఆయనకే అవకాశం ఇచ్చారు.
కేసీఆర్ ఈరోజు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ అభ్యర్థిని ప్రకటించారు. ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం నాగర్ కర్నూల్ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.కాగా పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. నిన్న నాలుగు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నెల 12న కరీంనగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్. కరీంనగర్ సభ అనంతరం ఖమ్మంలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు బీజేపీ తెలంగాణలోని 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిపై మాత్రమే స్పష్టతనిచ్చింది. వంశీచంద్ రెడ్డి పాలమూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇటీవల జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.