కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎంపీ రాములు?
X
ఎమ్మెల్యే పదవి గొప్పదా? ఎంపీ పదవి గొప్పదా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం అంత సులభం కాదు. ఆయా నేతల కెరీర్, పార్టీ అవసరాలు, అవకాశాలను బట్టి సమాధానం వస్తుంది. ‘నేను లోకల్’ తొడ కొట్టి చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే గిరీ కావాలి. లోకల్‌కు మించిన ఇమేజ్, మొత్తం లోక్ సభ నియోజకవర్గంపై పట్టు కావాలంటే పార్లమెంటుకు వెళ్లాలి. ఎవరి చాయిస్ వారిది. ఎన్నికలు దగ్గర పడినప్పుడు అదో ఇదో జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం పొరపడినా ఐదేళ్ల వరకు చేసేదేమీ ఉండదు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు ఇదే ఆలోచనలో ఉన్నారు. త్వరలో జరిగేఅసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అచ్చంపేట నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును తప్పించే సూచనలేవీ అధిష్టానం నుంచి రాకపోవడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం.
విభేదాలు తీవ్రం
ప్రభుత్వ విప్ కూడా అయిన గువ్వల బాలరాజుకు, రాములుకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఫ్లెక్సీల దగ్గర కూడా గొడవలు జరుగుతున్నాయి. కాబోయే ఎంపీ ,కాబోయే ఎమ్మెల్యే అంటూ రాములు కొడుకు భరత్ ప్రసాద్ ఫ్లెక్సీలు కనిపించడంతో గువ్వల భగ్గుమన్నారు. గువ్వల, బాలరాజుల మధ్య జరిగిన ఆడియో దుమారం రేపింది. జెడ్సీ చైర్మెన్ పదవి దక్కకపోవడంతో కల్వకుర్తి జెడ్సీటీసీకి రాజీనామా రేసిన భరత్ ప్రసాద్.. గువ్వలపై బహిరంగంగానే విమర్శలు సంధించారు. ఆధిపత్యం కోసం ఇద్దరూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. బీఆర్ఎస్ తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేని రాములు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజవర్గంలో తన పట్టు నిరూపించుకోవాలంటే అసెంబ్లీకి వెళ్లి తీరాలని రాములు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కూడా గువ్వలకే టికెట్ ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తనకు కాకపోయినా తన కొడుక్కి అయినా అచ్చంపేట టికెట్ ఇవ్వాలని రాములు కోరుతున్నారు. అధిష్టానం దీపిపై స్పందించడం లేదు. దీంతో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేయాలని రాములు ఆలోచన అని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
టచ్ లోకి సునీల్ కనుగోలు
రాములు తమవైపు వచ్చే అవకాశముందని తెలిసిన కాంగ్రెస్ తన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును రంగంలోకి దింపింది. అచ్చంపేట టికెట్ విషయంలో మాట్లాడడానికి కనుగోలు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కచ్చితమైన హామీ ఇవ్వడంతో పాటు పార్టీ తగినంత ప్రాధాన్యం ఇస్తేనే ముందుకు వెళ్లాలనన్న రాములు ఆలోచన. చేరికపై ఇప్పటికే రహస్యంగా మంతనాలు సాగుతున్నాయని, బీఆర్ఎస్ అభ్యర్థులు జాబితా కొలిక్కి వచ్చాక నిర్ణయం ఉంటుందని సమాచారం. గత రెండు దఫాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట నుంచి పోటీ చేసి గువ్వల చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా ఈ సీటును తన ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ పక్కా వ్యూహం రచిస్తోంది.