KTR : కేంద్రంలో సంకీర్ణమే.. కింగ్ మేకర్ అవుతాం - కేటీఆర్
X
లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
75 ఏళ్లు దాటిన నేతలన్నలకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ చేనేత మగ్గం పథకంలో భాగంగా నేతన్నలకు 16 వేలకుపైగా కొత్త మగ్గాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రూ.40.50 కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. చేనేతలకు డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా ₹200కోట్ల క్యాష్ క్రెడిట్ లిమిట్ అందించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. చేనేత మిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు ₹3వేలు ఇచ్చే పథకాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని స్పష్టం చేశారు.
పీఎం నరేంద్రమోడీ చేనేత మీద 5శాతం జీఎస్టీ వేశారన్న కేటీఆర్.. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చేనేత వద్దు అన్నీ రద్దు అన్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని మండిపడ్డారు. కేంద్రానికి నేతన్నల గురించి తెలియదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.