BRS Election campaign: నేడు BRS ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించనున్న సీఎం
X
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ మరో రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తోలుత జడ్చర్ల, ఆ తర్వాత మేడ్చల్ లో జరిగే బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని గులాబీ బాస్ ప్రసంగించనున్నారు. ముందుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు కేసీఆర్. జడ్చర్ల సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో శివాలయం పక్కన ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్‌లో రానున్న క్రమంలో సభతోపాటు హెలీప్యాడ్, కాన్వాయ్, పార్కింగ్, సభాప్రాంగణం, వీఐపీ, ప్రధాన రహదారులు, తదితర ప్రాంతాల్లో దాదాపు 700 మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ముగ్గురు ఏఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 16మంది సీఐలు, 45 మంది ఎస్సైలతోపాటు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సభ అనంతరం.. మేడ్చల్‌లో జరిగే ప్రజా ఆశ్వీరద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి మల్లారెడ్డి సమావేశమై జన సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 15 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం రద్దీగా మారింది. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కుర్చీలు ఏర్పాటు చేసి సౌకర్యం కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, వైద్యశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ దృష్ట్యా బుధవారం నిర్వహించనున్న సభల విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటి వరకు 90 మందికి బీఫారాలను ఇవ్వగా.. మరో 19 మందికి ఇవ్వాల్సి ఉంది.