Home > తెలంగాణ > తెలంగాణలో ఎన్నికలు వాయిదా.. జమిలికి బీఆర్ఎస్ సిద్ధం..!

తెలంగాణలో ఎన్నికలు వాయిదా.. జమిలికి బీఆర్ఎస్ సిద్ధం..!

తెలంగాణలో ఎన్నికలు వాయిదా.. జమిలికి బీఆర్ఎస్ సిద్ధం..!
X

తెలంగాణలో అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించారు సీఎం కేసీఆర్. అన్నీ పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని అంతా అనుకుంటున్న సమయంలో జమిలి అంశం తెరమీదకు వచ్చింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై డైలామా నెలకొంది.

జమిలి ఎన్నికలపై మోదీ సర్కార్ దూకుడు పెంచింది. దీనిపై ఇప్పటికే కమిటీ వేసిన మోదీ సర్కార్.. ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లోనే వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే మరో మూడు నెలల్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

జమిలితో తెలంగాణలో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జనవరి 16తో తెలంగాణ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఈ లెక్కన చూస్తే డిసెంబర్ లోపు ఎన్నికలు పూర్తికావాలి. ప్రస్తుత పరిస్థితులు మాత్రం డిసెంబర్లో ఎన్నికలు జరిగేలా కన్పించడం లేదు. ఇక విపక్షాలను గందరగోళంలోకి నెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణలో ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని లేదంటే ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అక్టోబర్లో ఎన్నికల నోటీఫికేషన్ రావడం అనుమానమేనని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.

ఒకవేళ జమిలి ఎన్నికలను శరవేగంగా తెరమీదకు తెచ్చినా గులాబీ బాస్ కార్యాచరణతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించినా.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తమకే అనుకూలంగా మారుతాయని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో జమిలీపై వారికి దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది.

జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే.. అందులో తాము చేసేదేమీ ఉండదని పార్టీ నేతలతో సీఎం అన్నారట. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా అభ్యర్థులూ సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒకవేళ అసెంబ్లీని పొడిగించినా అది తమకు మేలే చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సమయంలో జోరుగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలను ఆకట్టుకోవచ్చని గులాబీ బాస్ ప్లాన్గా సమాచారం. ఎన్నికలెప్పుడు వచ్చినా దాన్ని అనుకూలంగా మార్చుకోవాలని కేసీఆర్ గట్టితో ప్లాన్తో ఉన్నారు.


Updated : 12 Sept 2023 5:23 PM IST
Tags:    
Next Story
Share it
Top