Home > తెలంగాణ > BRS : ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్‌కు రూ.683 కోట్ల విరాళాలు.. వీరే దాతలు!

BRS : ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్‌కు రూ.683 కోట్ల విరాళాలు.. వీరే దాతలు!

BRS : ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్‌కు రూ.683 కోట్ల విరాళాలు.. వీరే దాతలు!
X

బీఆర్‌ఎస్‌ పార్టీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారీగా విరాళాలు సేకరించింది. ఒక్క ఏడాదిలో ఆ పార్టీకి రూ.683 కోట్ల విరాళాలు లభించాయి. వీటిలో రూ.529 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా సమకూరగా.. మిగతా మొత్తం రూ. 154 కోట్లు వ్యక్తిగత చందాల ద్వారా వచ్చాయి. వ్యక్తుల నుంచి వచ్చిన రూ.154 కోట్లలో .. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రూ. 10 కోట్లు, గాయత్రీ గ్రానైట్స్(బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర) రూ. 10 కోట్లు, హన్స్ పవర్ కంపెనీ(పువ్వాడ అజయ్ బంధువులు) రూ. 10 కోట్లు, రాజపుష్ప ప్రాపర్టీస్ (జయచంద్రారెడ్డి) రూ. 10 కోట్లు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి రూ. 5 కోట్లు.. ఇలా మొత్తం రూ.45 కోట్లు వచ్చాయి. ఓ ప్రాంతీయ పార్టీకి ఓ ఏడాదిలో ఇంత భారీ మొత్తంలో విరాళాలు రావడం బహుశా ఇదే మొదటిసారి.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు రూ.1,148 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయం జరిగింది. వీటి ద్వారా వివిధ పార్టీలకు కోట్ల రూపాయలు నిధులు సమకూరాయి. వీటిలో హైదరాబాద్ SBI బ్రాంచ్‌ నుంచి అత్యధికంగా రూ. 376 కోట్లు సేకరించడం విశేషం. ఇక బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, గాంధీనగర్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై మరియు న్యూఢిల్లీలో సైతం ఎలక్టోరల్ బాండ్ల నుంచి భారీగా విరాళాలను సేకరించారు.

కోటి రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లు కొనుగోలు చేయడం సాధారణ వ్యాపారవేత్తల వల్ల సాధ్యం కాదని, బిజినెస్ టైకూన్లు మాత్రమే వాటిని కొని ఉంటారని మార్కెట్ నిపుణుడు లోకేష్ బత్రా అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళంలో పారదర్శకత ఉండదని, అవినీతి సొమ్ము అయి ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ అభ్యర్థి ఎవరో, అతనికంత డబ్బు ఎలా వచ్చిందోనని తెలుసుకోవాలనుకుంటాడని చెప్పారు. వాస్తవానికి ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని RBI, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, న్యాయ శాఖ వ్యతిరేకించాయని అన్నారు.

ఈ పథకంలో దాతల పేర్లు వెల్లడించకూడదనే నిబంధన ఉందని, ఫలితంగా బాండ్లను విక్రయించేది ఎవరో, కొనేదేవరో పూర్తి వివరాలన్ని కేంద్ర ప్రభుత్వానికి తప్ప ఇంకెవరికీ తెలియదని లోకేష్ అన్నారు. ఎస్‌బీఐ కేంద్రం పరిధిలో ఉన్నందున ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎవరు ఎవరికి ఎంత నిధులు వస్తాయన్న విషయం కేంద్రానికి సులువుగా తెలిసిపోతుందని చెప్పారు. ఫలితంగా ప్రతిపక్షాలకు నిధులివ్వకుండా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు ఉంటాయని, ఈ ప్రభావం ప్రతి పౌరుడిపైనా ఉంటుందని అభిప్రాయపడ్డారు.




Updated : 3 Jan 2024 11:56 AM IST
Tags:    
Next Story
Share it
Top