Congress : టార్గెట్ కాంగ్రెస్.. 420 హామీలు పేరుతో బుక్లెట్ విడుదల
X
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఓ బుక్లెట్ విడుదల చేసింది. గెలుపు కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్కు గుర్తు చేసేలా "కాంగ్రెస్ 420 హామీలు" పేరుతో ఈ బుక్లెట్ రూపొందించింది.
లోక్‌సభ ఎన్నికల కోడ్ రాక ముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బుక్లెట్తో పాటు ఇటీవల విడుదల చేసిన ‘స్వేదపత్రం’ ప్రతిని కూడా నేతలకు అందించింది. తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని వివరిస్తూనే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడిపై పెంచేలా ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ హామీలు అమలులో ఆలస్యం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేసింది. కేవలం 420 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తామంటే కుదరదని, కాంగ్రెస్ చేసిన మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తూ ఆ పార్టీపై ఒత్తిడి పెంచుతామని బీఆర్ఎస్ హెచ్చరించింది.