Home > తెలంగాణ > శంకర్ నాయక్కు షాక్.. మహబూబాబాద్ బరిలో సత్యవతి రాథోడ్..!

శంకర్ నాయక్కు షాక్.. మహబూబాబాద్ బరిలో సత్యవతి రాథోడ్..!

శంకర్ నాయక్కు షాక్.. మహబూబాబాద్ బరిలో సత్యవతి రాథోడ్..!
X

అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్తో పాటు అధికార బీఆర్ఎస్లో టికెట్ల లొల్లి మొదలైంది. మహబూబాబాద్ బీఆర్ఎస్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్పై సొంత పార్టీ నేతలే ఎదురుతిరిగారు. శంకర్ నాయక్కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దని... ఆయనకు మళ్ళీ అవకాశమిస్తే తిరుగుబాటు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ హైకమాండ్ శంకర్ నాయక్ను పక్కనబెట్టి సత్యవతి రాథోడ్ను బరిలో దింపాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

శంకర్ నాయక్పై ఆగ్రహం

బీఆర్ఎస్ పార్టీ గత రెండుసార్లుగా శంకర్ నాయక్కు మహబూబాబాద్ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. కానీ ఆయన మాత్రం సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జాలు, రౌడీయిజం కారణంగా బీఆర్ఎస్ శ్రేణులకే కాక ప్రజలకు దూరమయ్యాయి. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే ఒకవేళ ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా జనం చిత్తుగా ఓడించడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక నేతలు సైతం ఆయనకు కాకుండా మరొకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

శంకర్ నాయక్పై అసంతృప్తి

క్షేత్రస్థాయి పరిస్థితులకు తోడు సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలు సైతం శంకర్ నాయక్ కు ప్రతికూలంగానే వచ్చినట్లు తెలుస్తోంది. వాటిల్లో ఆయనకు కనీసం పాస్ మార్కులు కూడా రాలేదని సమాచారం. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అలర్ట్ అయిన బీఆర్ఎస్ హైకమాండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బరి నుంచి తప్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీకి నమ్మినబంటులా ఉన్న సత్యవతి రాథోడ్కు ఈసారి మహబూబాబాద్ టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వాస్తవానికి బీఆర్ఎస్ అధినేతకు ఆమెపై మంచి అభిప్రాయం ఉంది. పార్టీ పట్ల విదేయత కలిగి ఉండటంతో పాటు నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తమ సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితమే సత్యవతి రాథోడ్ను పిలిపించిన పార్టీ నాయకుడు నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని ఆమెకు సూచించినట్లు సమాచారం.

సత్యవతి స్వామి భక్తి

2014లో డోర్నకల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యవతి రాథోడ్ రెడ్యానాయక్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆమె సీఎం కేసీఆర్‌పై స్వామిభక్తి చాటుకుంటూనే ఉంటారు. మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యేంత వరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని సత్యవతి శపథం చేశారు. అప్పటి నుంచి మండుటెండలోనూ కాళ్లకు బొబ్బలెక్కినా ఆమె చెప్పులు లేకుండానే తిరుగుతున్నారు. ఇటీవలే తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చ బొట్టు వేసుకున్న సత్యవతి రాథోడ్ మరోసారి స్వామి భక్తి చాటుకున్నారు.

మహబూబాబాద్ నుంచే పోటీ..!

వాస్తవానికి సత్యవతి రాథోడ్ డోర్నకల్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ను కాదని ఆమెకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. మహబూబాబాద్ లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోతు కవిత మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే శంకర్ నాయక్ రేసు నుంచి ఔట్ కావడంతో మాలోతు కవితకు నచ్చజెప్పి సత్యవతి రాథోడ్కు మహబూబాబాద్ టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.

Updated : 12 July 2023 12:44 PM GMT
Tags:    
Next Story
Share it
Top