KTR: కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఏమాత్రం పోటీ కాదు.. మంత్రి కేటీఆర్
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కు ఏమాత్రం పోటీ కాదని, రాబోయే ఎన్నికల్లో గతంలో వచ్చిన 88 స్థానాల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని బీఆర్ఎస్ లీడర్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిలో ఎన్నికలు, విపక్షాలపై మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందని.. బీ ఫారాల పంపిణీ కూడా పూర్తవుతుందని తెలిపారు. ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్(KTR).. ఫలితాల్లోనూ ముందే ఉంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు 40 చోట్ల అభ్యర్థులు లేరని.. బీజేపీ యుద్దానికి ముందే చేతులు ఎత్తేశారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులు ఈసారి 110 చోట్ల డిపాజిట్ కోల్పోతారని విమర్శించారు.
సీఎం కావాలనే పిచ్చి ఆలోచనలు, ఎజెండాలు తనకేవీ లేవని, తన కంటే సమర్థులు, తెలివైన వారు చాలా మంది ఉన్నారని అన్నారు. 'మా నాయకుడు కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి. ఇందులో ఎవరికీ రెండో ఆలోచన లేదు.' అని స్పష్టం చేశారు. దేశంలో కుంభకోణాల కుంభమేళానే కాంగ్రెస్ అని ఎమ్మెల్యే సీట్లను అమ్ముకునే దౌర్భాగ్యం ఆ పార్టీదని ఆరోపించారు. బీజేపీ నేతలు యుద్ధానికి ముందే చేతులెత్తేశారని, ఈసారి ఆ పార్టీ అభ్యర్థులు 110 చోట్ల డిపాజిట్లు కోల్పోతారని అన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
కాంగ్రెస్ పదేళ్ల హయంలో ఏపీపీఎస్సీ(APPSC) ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు కేవలం 24 వేలు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. అందులో తెలంగాణ వాటా పది వేలని వివరించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 1.34 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని.. మిగిలిన 90 వేల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. వాళ్లు ఏడాదికి 1000 ఉద్యోగాలు ఇస్తే.. మేము 13 వేలు ఇచ్చామని వెల్లడించారు. 30 వైద్య కళాశాలలు పెట్టిన బీఆర్‌ఎస్ ఎక్కడ.. మూడు కళాశాలలు పెట్టిన కాంగ్రెస్ ఎక్కడని ప్రశ్నించారు. TSPSC లో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిచేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్, తాగునీరు, వైద్యం, సాగునీరు ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో.. తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.