Home > తెలంగాణ > మేడిగడ్డలో చిన్న సమస్యను పెద్దదిగా చూపిస్తున్నారు.. కేటీఆర్

మేడిగడ్డలో చిన్న సమస్యను పెద్దదిగా చూపిస్తున్నారు.. కేటీఆర్

మేడిగడ్డలో చిన్న సమస్యను పెద్దదిగా చూపిస్తున్నారు.. కేటీఆర్
X

మేడిగడ్డ బ్యారేజీ సందర్శనలో మాజీ మత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపిస్తున్నారన్నారు. మొత్తం ప్రాజెక్టు, రూ.లక్ష కోట్లు వృథా చేశారంటూ అధికార పార్టీ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలకు పగ, కోపం ఉంటే రాజకీయంగా మాపై తీర్చుకుంటే ఇబ్బందిలేదని.. కానీ రైతులు, రాష్ట్రంపై పగ పట్టొద్దని కోరారు. రైతులపై పగబట్టకుండా నీటిని విడుదల చేయాలన్నారు. 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బ్యారేజీలో కేవలం 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందన్న కేటీఆర్... గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాగర్జున సాగర్, శ్రీశైలం ప్రాజక్టుల్లోనూ లీకేజీలు వచ్చాయన్నారు.

వీలైనంత త్వరగా నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. వర‌ద‌లు వ‌చ్చేలోగా మేడిగ‌డ్డ‌లో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టి, దాన్ని సుర‌క్షిత‌మైన స్థితికి తేవాల‌న్నారు. మేడిగ‌డ్డ విష‌యంలో బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి. సాగునీరు లేక ఇప్ప‌టికే క‌రీంన‌గ‌ర్‌తో పాటు ఇత‌ర జిల్లాల్లోనూ పంట‌లు ఎండిపోయే ప‌రిస్థితులు వ‌చ్చాయి. వానాకాలం లోగా రిపేర్లు పూర్తి చేసి రైతుల‌కు నీళ్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటన సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుపెట్టిన బారికేడ్లను దాటుకుని బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా బ్యారేజీపైకి దూసుకొచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గేట్లను మూసివేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది


Updated : 1 March 2024 12:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top