Home > తెలంగాణ > KTR : 'అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నరు.. ఏమైంది?'.. సీఎంపై కేటీఆర్ సెటైర్లు

KTR : 'అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నరు.. ఏమైంది?'.. సీఎంపై కేటీఆర్ సెటైర్లు

KTR : అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నరు.. ఏమైంది?.. సీఎంపై కేటీఆర్ సెటైర్లు
X

కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం లెక్క తెస్తే 420 హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను 6 నెలల్లో అమలు చేయకపోతే ప్రభుత్వం ప్రజల నుంచి తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అన్నారని గుర్తు చేశారు. తుమ్మల నాగేశ్వర రావు రుణాలు వసూలు చేయాలని ఆదేశాలు జారి చేశారని అన్నారు. లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైందన్నారు. నోటికి ఎంత వస్తె అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. అందుకే 420 హామీలను చేసేదాకా విడిచి పెట్టమని కేటీఆర్ అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతుందన్నారు.

ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అది తమ మేనిఫెస్టోలో లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం అబద్ధం చెప్పారని సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు చెప్పేవి అబద్ధాలు అని రుజువు చేసేందుకు స్వేదపత్రం విడుదల చేశామని గుర్తుచేశారు. ఆ స్వేదపత్రంలో సమగ్ర అభివృద్ధిని పొందుపరిచామని గణాంకాలు, ఆధారాలతో సహా వివరించామని పేర్కొన్నారు. ఒక పక్క అదానీని రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే.. అదే రోజు అదానీతో రేవంత్ రెడ్డి భేటీ కావడం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటే అని మరోసారి రుజువైందని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు అదానీని తెలంగాణ వైపు కన్నెత్తి చూడనివ్వలేదు.. కాంగ్రెస్ అధికారింలోకి వచ్చిన నెలరోజుల్లోనే అదానీ చేతుల్లోకి తెలంగాణ వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు అదానీ దొంగ అని విమర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి, దావోస్‌లో అదానీతో అలయ్‌ బలయ్‌ చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ ఆదేశాల మేరకే అదానీతో సీఎం రేవంత్‌ కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. అదానీపట్ల కాంగ్రెస్‌ పార్టీ వైఖరి మారటానికి కారణాలేంటో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్, హరీష్ రావు నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేసి వచ్చే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాలని పిలుపునిచ్చారు. ఈసారి కూడా మెదక్‌లో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.




Updated : 19 Jan 2024 2:14 PM IST
Tags:    
Next Story
Share it
Top