TS Election : బీఎస్పీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. జనరల్ స్థానం నుంచి ఆర్ఎస్పీ పోటీ..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగేందుకు టైం దగ్గరపడింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో జోరు పెంచాయి. రేసులో ముందున్న బీఆర్ఎస్.. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయగా.. తాజాగా బీఎస్పీ తమ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. 20 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు.
రిజర్వ్డ్ సీట్ కాదని
ప్రవీణ్ కుమార్ ఎస్సీ కావడంతో ఆయన రిజర్వుడు సీటు నుంచి బరిలో దిగుతారని అంతా భావించారు. సొంతజిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్లోని ఆలంపూర్ నుంచి ఆయన పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని జోరుగా ప్రచారం సాగింది. అవన్నీ ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు కావడంతో అదే నిజం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
బీఎస్పీకి పట్టు
ఆర్ఎస్పీ మాత్రం ఎవరూ ఊహించని విధంగా జనరల్ స్థానమైన సిర్పూర్ నుంచి బరిలో దిగి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఆయన నిర్ణయం వెనుక చాలా సమీకరణాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడైన తాను జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తే.. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతుందన్న ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. దీనికి తోడు సిర్పూర్ నియోజకవర్గంపై బహుజన సమాజ్ పార్టీకి మొదటి నుంచి కొంత పట్టుంది. బాఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఘన విజయం సాధించారు.
కోనప్పపై అసంతృప్తి
మరోవైపు సిర్పూర్ నియోజకవర్గంలో దళిత, గిరిజన, బహుజన సంఘాలు బలంగా ఉన్నాయి. బుద్ధిస్టులు,స్వేరోస్ సహా విద్యావంతులు, మెజారిటీ మైనారిటీల ఓట్లు తనకే గంప గుత్తగా పడతాయన్నది ఆర్ఎస్పీ అంచనా. అన్నింటికి మించి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి తమకు కలిసొచ్చే అవకాశముంది. కోనప్ప సన్నిహితుడైన అర్షద్ హుస్సేన్ కొన్నాళ్ల క్రితం బీఎస్పీలో చేరారు. ఎమ్మెల్యేను ఓడించాలని కంకణం కట్టుకున్న ఆయన.. అప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం కసిగా పనిచేస్తున్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో పార్టీని విస్తరించారు. ఈ క్రమంలో కోనప్ప బాధిత నేతలంతా సిర్పూర్ నుంచి పోటీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఒప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ రిజర్వు స్థానాలైన బెల్లంపల్లి, చెన్నూరు, ఎస్టీ స్థానాలైన ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్పైనా బీఎస్పీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, మంచిర్యాల జనరల్ స్థానాల్లో ఎన్నికల నోటిఫికేషన్ నాటికి బలమైన అభ్యర్థులు వస్తారని బీఎస్పీ అంచనా వేస్తోంది.
బీఎస్పీ అభ్యర్థుల లిస్టు
సిర్పూర్ (జనరల్) - డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
జహీరాబాద్ (ఎస్సీ)- జంగం గోపి
పెద్దపల్లి (జనరల్)- దాసరి ఉషా
తాండూర్ (జనరల్)- చంద్రశేఖర్ ముదిరాజ్
దేవరకొండ (ఎస్టీ)- డా. ముదావత్ వెంకటేశ్ చౌహాన్
చొప్పదండి (ఎస్సీ)- కొంకటి శేఖర్
పాలేరు (జనరల్)- అల్లిక వెంకటేశ్వరరావు యాదవ్
నకిరేకల్ (ఎస్సీ)- మేడి ప్రియదర్శిని
వైరా (ఎస్టీ)- బానోత్ రాంబాబు నాయక్
ధర్మపురి (ఎస్సీ) - నక్కా విజయ్ కుమార్
వనపర్తి (జనరల్)- నాగమోని చెన్న రాములు ముదిరాజ్
మానకొండూర్(ఎస్సీ) -ఎన్. రాంచందర్
కోదాడ (జనరల్) - పిలుట్ల శ్రీనివాస్
నాగర్‌కర్నూలు (జనరల్)- కొత్తపల్లి కుమార్
ఖానాపూర్ (ఎస్టీ) - బన్సిలాల్ రాథోడ్
అందోల్ (ఎస్సీ)- ముప్పారపు ప్రకాశం
సూర్యాపేట (జనరల్)- వట్టె జానయ్య యాదవ్
వికారాబాద్ (ఎస్సీ) -గడ్డం క్రాంతి కుమార్
కొత్తగూడెం (జనరల్) -ఎర్రా కామేశ్
జుక్కల్ (ఎస్సీ)- ప్రద్న్య కుమార్ మహదేవ్‌రావు ఏకాంబర్