'కారు'ను పక్కకు నెట్టేసిన 'ఏనుగు'.. పొత్తుపై మాయావతి సంచలన ప్రకటన
X
బీఎస్‌పీతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తోంది. గతంలో ఈ విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కూడా చర్చలు జరిపారు. అయితే తాజాగా బీఆర్ఎస్‌కు బీఎస్‌పీ షాకిచ్చింది. 'కారు'ను 'ఏనుగు' పక్కకు నెట్టేసింది. బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఈ విషయంపై సంచలన ప్రకటన చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు మాయావతి స్పష్టం చేశారు. ఇండియా కూటమి, ఏ ఇతర పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్‌పీ పూర్తి బలంతో పోటీలోకి దిగుతోందని, ఈ సందర్భంగా తాము ఏ థర్డ్ ఫ్రంట్ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకోవడం లేదని మాయావతి తెలిపారు. బీఆర్ఎస్‌తో తాము పొత్తు పెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ట్విట్టర్ వేదికగా మాయావతి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా తమ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మాయావతి ట్వీట్‌లో రాసుకొచ్చారు. మాయావతి ప్రకటనతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఓ వైపు ఎంపీలు బీజేపీలోకి జంప్ అవుతుంటే మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ జెండాలు కప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీఎస్‌పీ పొత్తుకోసం రావడం ఖాయం అని అనుకున్న తరుణంలో మాయావతి ప్రకటన షాకిచ్చింది. 'కారు' ప్రయాణాన్ని మాయావతి వద్దనుకుందని, కేసీఆర్‌కు గట్టిగానే 'ఏనుగు' దెబ్బ తగిలిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.