Cabinet Meeting : నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా..
X
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు. దీంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. అయితే మళ్లీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, అక్టోబరు మొదటి వారంలో కేబినెట్ భేటీ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.గత వారం రోజులుగా యశోద వైద్యులు సీఎం కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. గతంలో కేసీఆర్‌కు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఈసారి కేసీఆర్‌కు ప్రగతి భవన్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.
ఒకవేళ ఈరోజు కేబినెట్ భేటి జరిగిందే ఉంటే.. సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ పై ప్రధానంగా చర్చ జరిగేది. అలాగే.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, కొత్త పథకాలపై కూడా కీలక నిర్ణయం తీసుకునే వారు. అలాగే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణపై కూడా చర్చ జరిగేది. అక్టోబర్ రెండో వారంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది. దీంతో అక్టోబర్ మొదటివారంలో కేబినెట్ సమావేశం జరిగితే, అదే చివరి భేటీగా నిలవనుంది. దసరా తర్వాత ప్రచారం మొదలుపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థల పేర్లతో తొలి జాబితాను ప్రకటించగా.. అందులో మైనంపల్లి టికెట్ ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్‌కు వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంతో కలిపి 5 నియోజకవర్గాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేస్తోంది. త్వరలోనే రెండో జాబితాను బీఆర్ఎస్ విడుదల చేయనుంది.