ఒవైసీపై కేసు బుక్ చేసిన సంతోష్ నగర్ పోలీసులు
X
ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు బుక్ అయింది. ఎన్నికల డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలను ఆయనపై సంతోష్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. మంగళవారం రాత్రి లలితాబాగ్‌లో అక్బరుద్దీన్ ప్రచారం నిర్వహించారు. అయితే నిబంధనల మేరకు సమయం అయిపోతుండటంతో ప్రచారం ముగించాలని స్థానికంగా విధులు నిర్వస్తున్న ఎస్సై శివచంద్ర అక్బరుద్దీన్‌ను కోరారు.
ప్రచారం ముగించాలన్న పోలీసు అధికారిపై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా సమయం ఉందని, తాను మాట్లాడి తీరతానని, తనను ఆపేవాళ్లింకా పుట్టలేదని అన్నారు. అంతటితో ఆగకుండా తన ఒంట్లో బుల్లెట్లు దిగినా.. కత్తిగాయాలైనా ధైర్యం ఇంకా మిగిలే ఉందని, ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్న అందరూ నిన్ను పరిగెత్తిస్తారంటూ ఎస్సైను ఉద్దేశించి అక్బరుద్దీన్ హెచ్చరించారు.అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఘటనపై ఐపీసీ సెక్షన్ 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు ప్రకటించారు.