Revanth Reddy Case : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు
X
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చేసిన ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఆయనపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు గోవర్దన్ పట్వారి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ లు తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసినందున వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
మహబూబ్ నగర్ పోలీసులను గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెట్టుకుంటామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మిత్తితో సహా కలిపి చెల్లిస్తామని హెచ్చరించారు.