TS Election Code: 10 రోజుల్లోనే రూ.165 కోట్లు.. పట్టుబడుతున్న సొత్తు
X
ఎన్నికల వేళ నోట్ల కట్టలు, ఆభరణాలు, మద్యం భారీగా పట్టుబడుతోంది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన పది రోజుల్లోనే.. పట్టుబడిన సొత్తు గత అసెంబ్లీ ఎన్నికల మొత్తాన్ని దాటిపోయింది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలు, మద్యం విలువ రూ.165 కోట్లను దాటింది. 2018 ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చిన గణాంకాల ప్రకారం పట్టుబడిన నగదు, మద్యం, ఇతర సామగ్రి విలువ సుమారు రూ.137 కోట్లు మాత్రమే. కానీ, తాజా ఎన్నికల సమయంలో కనీసం నోటిఫికేషన్ కూడా రాకుండానే బుధవారం నాటికి పట్టుకున్న మొత్తం విలువ రూ.165.81 కోట్లు. అంటే ఎన్నికల వేళ ఏ స్థాయిలో డబ్బు, మద్యం, డ్రగ్స్, తాయిలాలను రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులు ఓటర్లకు ఎరగా వేసేందుకు సిద్ధమవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనితో పోలీసులు కూడా అదేస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తుండటంతో భారీగా పట్టుబడుతున్నాయి.
ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.77 కోట్ల 87 లక్షలు. అక్రమ సరఫరా ద్వారా పట్టుబడిన మద్యం 59,091 లీటర్లు. 18,088 కిలోల నల్ల బెల్లం, 614 కిలోల ఆలం కాగా.. వాటి విలువ రూ.8.99 కోట్లు. రూ.7.55 కోట్ల విలువైన 2,320 కిలోల గంజాయి పట్టుబడింది. సరైన ఆధారాలు, పత్రాలు, వివరాలు లేని 72 కిలోల బంగారు, 429 కిలోల వెండి, 42 క్యారట్ల వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.62 కోట్ల 73 లక్షలకు పైగా ఉంది. వీటితో పాటు రూ.8.64 కోట్ల విలువైన ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి, బియ్యం మొదలైన వస్తువులు పటుబడ్డాయి.నగదు, అన్ని వస్తువులు కలిపితే ఇప్పటి వరకు స్వాధీనం అయిన మొత్తం సొత్తు విలువ రూ.165 కోట్ల 81 లక్షల 4 వేల 699. ఇది గత అసెంబ్లీ ఎన్నికల రికార్డును అధిగమించింది.